ఇస్రో చేతిలో పుష్పక్... ఇక త్వరలో ప్రయోగమే?

June 23, 2024
img

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయాల పరంపరలో మరో అరుదైన విజయం నమోదు చేసుకుంది. ప్రతీసారి అంతరిక్షంలోకి ఉపగ్రహాలను తీసుకువెళ్ళేందుకు కోట్లాది రూపాయలు ఖర్చుతో ఓ కొత్త వాహక నౌక (లాంచింగ్ వెహికల్)ని ఉపయోగిస్తోంది. ఆ ఖర్చును తగ్గించుకోగలిగితే మరిన్ని అంతరిక్ష ప్రయోగాలు చేయగలుగుతుంది.

కనుక ఇస్రో శాస్త్రవేత్తలు పుష్పక్ అనే జెట్ విమానాన్ని పోలిన వాహకనౌకని తయారుచేసి పరీక్షలు జరుపుతున్నారు. అది ఉపగ్రహాలను అంతరిక్షంలోకి చేర్చి తిరిగి విమానంలా ఇస్రో కేంద్రంలో ల్యాండ్ అవుతుంది.

ఇప్పటికే ‘పుష్పక్’ రెండుసార్లు విజయవంతంగా పరీక్షలు జరిపారు. శనివారం ఉదయం కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ వద్ద గల ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ కేంద్రంలో మూడోసారి పరీక్షించినప్పుడు అది కూడా విజయవంతం అయ్యింది. 

ముందుగా వాయుసేనకు చెందిన హెలికాఫ్టర్‌తో ‘పుష్పక్’ని 4 కిమీ దూరం, 4.5 కిమీ ఎత్తుకు తీసుకువెళ్ళి అక్కడి నుంచి జార విడిచారు. అది గంటకు 320కిమీ వేగంతో దూసుకుపోయి, చిత్రదుర్గలో ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ చేరుకొని రన్ వేపై సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.

దానిలో అమర్చిన కంప్యూటర్ వ్యవస్థల ఆధారంగా అది పూర్తిగా స్వీయ నియంత్రణతో రన్ వేపై ఖచ్చితమైన ప్రదేశంలో దిగడంతో ఈ ప్రయోగం విజయవంతం అయిన్నట్లు ఇస్రో ప్రకటించింది. 

ఈ ప్రయోగం ద్వారా ‘పుష్పక్’లో అమర్చిన కంప్యూటర్ వ్యవస్థ, దాని ఇంజన్, ల్యాండింగ్ యంత్రాంగం, బ్రేకింగ్ యంత్రాంగం అన్నీ చాలా ఖచ్చితత్వంతో పనిచేశాయని ఇస్రో ప్రకటించింది. దీనిని పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతోనే తయారుచేశామని ఇస్రో తెలిపింది. 

పుష్పక్ మూడు ప్రయోగాలు విజయవంతం అయినందున త్వరలో ఇస్రో దాని ద్వారా ఉపగ్రహాలను అంతరిక్షంలో పంపిస్తే, పునర్వినియోగించగల వాహక నౌక కలిగిన అగ్ర రాజ్యాల సరసన భారత్‌ కూడా చేరుతుంది. ఇకపై అంతరిక్ష వాణిజ్యంలో అవి భారత్‌తో పోటీ పడాల్సి వస్తుంది. 


Related Post