కల్కి తర్వాత రాజా సాబ్ ఎప్పుడంటే...

June 26, 2024


img

ప్రభాస్‌ నటించిన కల్కి ఎడి2898 సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇంతకాలం ఆ సినిమా షూటింగ్‌, ప్రమోషన్స్‌తో క్షణం తీరిక లేకుండా పనిచేసిన ప్రభాస్‌, కొన్ని రోజులు విశ్రాంతి తీసుకునేందుకు విదేశాలకు వెళుతున్నారు.

అక్కడి నుంచి తిరిగి రాగానే మారుతి దర్శకత్వంలో చేస్తున్న ‘రాజాసాబ్’ సినిమా షూటింగ్‌ మొదలుపెడతారు. ప్రభాస్‌ తిరిగివచ్చేలోగా దర్శకుడు మారుతి, సంగీత దర్శకుడు తమన్ కలిసి చెన్నై మెరీనా బీచ్‌ అందాలను ఆస్వాదిస్తూ ఈ సినిమా కోసం పాటలు సిద్దం చేస్తున్నారు. ‘రాజాసాబ్’లో మొత్తం 5 పాటలలో మూడింటిని ఇప్పటికే పూర్తిచేసేశారు. మిగిలిన రెండు పాటలను కూడా సిద్దం చేసేస్తే ప్రభాస్‌ తిరిగి రాగానే షూటింగ్‌ ప్రారంభించాలనుకుంటున్నారు దర్శకుడు మారుతి. 

బాహుబలి సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోవడంతో, ఆ స్థాయిలోనే సినిమాలు చేస్తున్నారు. ఆ ట్రెండ్ బ్రేక్ చేస్తూ మారుతి దర్శకత్వంలో హర్రర్ కామెడీ జోనర్‌లో ‘రాజాసాబ్’ చేస్తున్నారు. ఈ సినిమా మళ్ళీ పూర్వపు ప్రభాస్‌ని గుర్తు చేస్తుందని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 

ఈ సినిమాలో  నిధి అగర్వాల్,  మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు. 

రాజాసాబ్ సినిమాకు సంగీతం: ఎస్ఎస్ తమన్, కెమెరా: కార్తీక్ పళని, ఆర్ట్ డైరెక్టర్: రాజీవన్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేస్తున్నారు. 

 పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రాజాసాబ్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు ‘రాజాసాబ్’ని తీసుకురావాలని దర్శకుడు మారుతి ప్రయత్నిస్తున్నారు. కానీ తేగలరో లేదో?


Related Post

సినిమా స‌మీక్ష