సినిమా చూడకుండానే రివ్యూస్... వెరీ బ్యాడ్!

June 01, 2024


img

విశ్వక్ సేన్‌ హీరోగా నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా శుక్రవారం విడుదలైంది. అయితే తెల్లవారుజామున 5 గంటలకే సినిమా రివ్యూ చూసి ఆశ్చర్యపోయానని విశ్వక్ సేన్‌ అన్నారు.

సినిమా చూడకుండా ముందు రోజు రాత్రే రివ్యూ వ్రాసిపెట్టుకుని తెల్లవారుజామున 5 గంటలకు రివ్యూ మీడియాలోకి పెట్టి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. 

సినిమా చూడకుండానే యాక్షన్ బాగోలేదు... మ్యూజిక్ బాగోలేదని రివ్యూలు వ్రాసి ఏమి సాధిద్దామనుకుంటున్నారని విశ్వక్ సేన్‌ ప్రశ్నించారు. కొంతమంది సినిమా ఫాస్ట్ హాఫ్‌కి ఓ రివ్యూ, సెకండ్ హాఫ్‌కి మరో రివ్యూ ఇస్తున్నారని అదెలా సాధ్యమని విశ్వక్ సేన్‌ ప్రశ్నించారు. 

వారు రివ్యూలు వ్రాయడం కోసం సినిమా ప్రదర్శన మద్యలో ఆపుతున్నారా లేక సినిమా చూడకుండానే రివ్యూలు వ్రాస్తున్నారా?అని విశ్వక్ సేన్‌ ప్రశ్నించారు. సినీ పరిశ్రమకి శత్రువులు మరెక్కడో లేరు మన చుట్టూనే ఉన్నారన్నారు.    

ప్రతీ సినిమాపై భారీగా పెట్టుబడి పెట్టి ఎంతోమంది నెలల తరబడి కష్టపడి పనిచేస్తేగానీ ఓ సినిమా తయారుకాదని, కానీ సినిమాను చూడకుండానే వ్రాసే రివ్యూలతో వారి శ్రమ, పెట్టుబడి అంతా బూడిదలో పోసిన పన్నీరుగా వృధా అయిపోతుందని విశ్వక్ సేన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 

సినిమాల వలన సినీ పరిశ్రమలో వేలాదిమందికి జీవనోపాధి లభిస్తోందని, ఈవిదంగా రివ్యూలు వ్రాస్తూ సినిమాలను దెబ్బతీసి వారికి నష్టం కలిగించవద్దని విశ్వక్ సేన్‌ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల హడావుడి వలన గత రెండు నెలలుగా థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయని ఇప్పుడిప్పుడే జనాలు థియేటర్లకు వస్తుంటే వారిని రాకుండా చేయవద్దని విశ్వక్ సేన్‌ విజ్ఞప్తి చేశారు.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకి కొందరు నెగెటివ్ రివ్యూలు వ్రాసినప్పటికీ, సినిమా చూసిన ప్రేక్షకుల మౌత్ టాక్ ద్వారా మళ్ళీ పుంజుకుందని విశ్వక్ సేన్‌ చెప్పారు. సినిమా బాగుంటే ఎవరెన్ని చెప్పినా ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని, అందుకు తన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఉదాహరణ అని విశ్వక్ సేన్‌ అన్నారు.


Related Post

సినిమా స‌మీక్ష