మియాపూర్-చందానగర్‌ పరిధిలో కర్ఫ్యూ

June 23, 2024
img

హైదరాబాద్‌లోని మియాపూర్-చందానగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఈ నెల 29వరకు సెక్షన్ 144 విధిస్తున్నట్లు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ప్రకటించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోగల ప్రశాంత్ నగర్‌ వాడ సర్వే నంబర్ 100,101లలో 525 ఎకరాల భూములపై న్యాయవివాదం నడుస్తోంది. 

దేశ విభజన సమయంలో వాటి యజమానులు పాకిస్తాన్ వలస వెళ్ళిపోయి అక్కడే స్థిరపడటంతో, రాష్ట్ర ప్రభుత్వం ఆ భూములను హెచ్ఎండీఏకు అప్పగించింది. దీనిపై అభ్యంతరాలు చెపుతూ కొందరు హైకోర్టుకు వెళ్ళగా న్యాయస్థానం ఆ భూములు రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతాయని స్పష్టం చేసింది. దాంతో వారు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. 

ఆ కేసు విచారణ ఇంకా నడుస్తుండగానే, హైదరాబాద్‌లో భూముల ధరలు విపరీతంగా పెరిగి, రియల్ ఎస్టేట్ సంస్థలు పుట్టుకురావడంతో ఇప్పుడు వేలకోట్లు విలువ చేసే ఆ భూములపై అందరి కళ్ళు పడ్డాయి. వాటిని ఎలాగైనా దక్కించుకోవాలనుకున్న కొందరు వ్యక్తులు సుమారు 2,000 మంది పేదలను ఆ ప్రదేశంలో గుడిసెలు వేసుకునేందుకు పంపారు. 

ఒకేసారి అంత మంది వచ్చి ఆ భూములను ఆక్రమించేందుకు రావడంతో హెచ్ఎండీఏ, రెవెన్యూ, పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యి అక్కడి నుంచి వారిని ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారు.

కానీ వారు పోలీసులపై రాళ్ళతో దాడి చేయడం ప్రారంభించారు. దీంతో పోలీసులు వారిపై స్వల్పంగా లాఠీ చార్జ్ చేసి అక్కడి నుంచి తరిమేశారు. కానీ వాళ్ళు మళ్ళీ తిరిగివచ్చే అవకాశం ఉందని భావించడంతో, అక్కడ భారీగా పోలీసులను మోహరించి, ఈ నెల 29వరకు కర్ఫ్యూ విధించారు.

Related Post