వరంగల్‌ ఎన్ఐటి విద్యార్ధికి రూ.88 లక్షల వార్షిక ప్యాకేజ్

July 04, 2024


img

వరంగల్‌ జాతీయ సాంకేతిక సంస్థ (ఎన్ఐటి) బీటెక్ విద్యార్ధి రవిషా 2023-2024 క్యాంపస్ సెలక్షన్స్ లో రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడని ఆ సంస్థ డైరెక్టర్‌ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుద్ధి మీడియాకు తెలియజేశారు. 

పంజాబ్‌ రాష్ట్రంలో లూధియానాకు చెందిన రవిషా తల్లి గృహిణి కాగా తండ్రి వ్యాపారవేత్త అని తెలిపారు. తమ సంస్థలో మరో 12 మంది విద్యార్దులు ఏడాదికి రూ. 68 లక్షల వేతనంతో ఐ‌టి కంపెనీలలో ఉద్యోగాలు సాధించారని ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుద్ధి చెప్పారు.

 తమ సంస్థలో జరిగిన క్యాంపస్ సెలక్షన్స్ లో సగటున ఒక్కో విద్యార్ధి రూ.15.60 లక్షలు వార్షిక వేతనం సాధించారని చెప్పారు. వారిలో ఎక్కువ మంది ఐ‌టి కంపెనీలలో ఉద్యోగాలు సంపాదించుకున్నవారే అని ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుద్ధి చెప్పారు. 

బీటెక్ విద్యార్దులలో 82%, ఎంటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ తదితర విద్యార్దులు 76% ప్లేస్ మెంట్స్ సాధించారని చెప్పారు. ఈ ఏడాది క్యాంపస్ సెలక్షన్స్ లో 250 ఐ‌టి, ప్రైవేట్ కంపెనీలు, 10 ప్రభుత్వ రంగ సంస్థలు వచ్చి ఉద్యోగాలు భర్తీ చేసుకున్నాయని చెప్పారు. క్యాంపస్ సెలక్షన్స్ కు మొత్తం 1,483 మంది విద్యార్దులు హాజరవగా వారిలో 1,128 మంది ఉద్యోగాలు సాధించారని ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుద్ధి మీడియాకు తెలియజేశారు.


Related Post