గ్రూప్-1 మెయిన్స్‌ 1:50 నిష్పత్తి ప్రకారమే: టీజీపీఎస్‌ఎస్సీ

July 04, 2024


img

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలలో అర్హత సాధించిన అభ్యర్ధులకు టీజీపీఎస్‌ఎస్సీ నిరాశ కలిగించే విషయం చెప్పింది. గ్రూప్-1 మెయిన్స్‌ పరీక్షకు 1:100 (ఒక పోస్టుకి వంద మంది అభ్యర్ధులు) నిష్పత్తిలో ఎంపిక చేయడం సాధ్యం కాదని కనుక 1:50 నిష్పత్తిలో  ప్రకారమే మెయిన్స్‌ పరీక్షకు ఎంపిక చేస్తామని తెలియజేస్తూ బుధవారం ఓ మేమో జారీ చేసింది. 

హైకోర్టు ఆదేశం, అభ్యర్ధుల విజ్ఞప్తి మేరకు పునః పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేసింది. ఈ ఉద్యోగాల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్‌, ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్:55,  జీవో నంబర్ 29లో 25వ నంబర్ పేరా, తెలంగాణ రాష్ట్ర సబార్డినేట్ సర్వీస్ రూల్స్-1962లోని సెక్షన్స్ 22,22ఏ నిబంధనలు, ఇంకా పలు అంశాలను పరిశీలించి, అన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత గ్రూప్-1 మెయిన్స్‌ పరీక్షకు 1:50 నిష్పత్తి ప్రకారమే అభ్యర్ధులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేయాలని నిర్ణయించిన్నట్లు టీజీపీఎస్‌ఎస్సీ తెలియజేసింది. 

ఈ విషయంలో హైకోర్టు ప్రభుత్వానికి సూచన చేయగలదు కానీ కలుగజేసుకోలేదని న్యాయస్థానం ముందే చెప్పినందున, అభ్యర్ధులు మళ్ళీ కోర్టుని ఆశ్రయించినా ప్రయోజనం ఉండదు. కనుక టీజీపీఎస్‌ఎస్సీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి లేదా సుప్రీంకోర్టుని ఆశ్రయించాల్సి ఉంటుంది.   



Related Post