తెలంగాణ మంత్రివర్గ విస్తరణ వాయిదా

July 04, 2024


img

దాదాపు నెలరోజులుగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అంటూ క నేతలు చాలా హడావుడి పడుతున్నారు. దీని కోసమే సిఎం రేవంత్‌ రెడ్డి, డెప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి తదితరులు ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్‌ అధిష్టానంతో సుదీర్గంగా చర్చించారు కూడా.

మంత్రివర్గ విస్తరణతో పాటు పిసిసికి కొత్త అధ్యక్షుడు కూడా వస్తారని రేవంత్‌ రెడ్డి చెప్పారు. సిఎం రేవంత్‌ రెడ్డి దీని కోసమే మరోసారి మళ్ళీ నిన్న మధ్యాహ్నం ఢిల్లీ వెళ్ళారు కూడా. కానీ నిన్న పర్యటన తర్వాత మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడింది. అలాగే పిసిసి అధ్యక్షుడు మార్పుకి కూడా కాంగ్రెస్‌ అధిష్టానం బ్రేక్ వేసింది. 

కాంగ్రెస్ పార్టీలో సుమారు డజను మందికి పైగా ఆశావాహులు, సీనియర్ నేతలు మంత్రి పదవులకు పోటీ పడుతున్నారు. మరికొందరు సీనియర్లు తాము సూచించినవారికే మంత్రి పదవులు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. కులాలు, జిల్లాల లెక్కల ప్రకారం మంత్రి పదవులు ఆశిస్తున్నవారూ ఉన్నారు. కనుక వారిలో ఎవరిని కాదన్నా పార్టీలో అసంతృప్తి మొదలవుతుంది. దాంతో ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తే ప్రభుత్వం పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.

కనుక కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలిసారిగా రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టి, బడ్జెట్‌ సమావేశాలు ముగిసిన తర్వాత మళ్ళీ మంత్రి వర్గ విస్తరణ గురించి ఆలోచించవచ్చని అంతవరకు వాయిదా వేయాలని కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయించింది. మంత్రి పదవుల కోసం ఆశపడుతున్నవారు తీవ్ర నిరాశ చెందే ఉంటారు.


Related Post