ములుగు జిల్లా పేరు మార్పుకి నోటిఫికేషన్‌ జారీ

July 03, 2024


img

కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లాల పునర్విభజన చేసి కొత్తగా ఏర్పాటు చేసిన వాటికి భద్రాద్రి కొత్తగూడెం, కొమురం భీమ్ ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి వంటి పేర్లు పెట్టడాన్ని అందరూ హర్షించారు. అయితే రాష్ట్రానికే ఎంతో ప్రతిష్టాత్మకమైన సమ్మక్క-సారలమ్మల దేవాలయం గల ములుగు జిల్లాకు వనదేవతల పేర్లు ఎందుకు జోడించలేదో తెలీదు.

ఆ లోటుని ఇప్పుడు సిఎం రేవంత్‌ రెడ్డి తీర్చబోతున్నారు.జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధుల అభ్యర్ధన మేరకు ములుగు జిల్లా పేరుని సమ్మక్క-సారలమ్మ ములుగు జిల్లాగా మార్చేందుకు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా పేరుని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

నియమ నిబందనల ప్రకారం ముందుగా జిల్లా వ్యాప్తంగా గురువారం గ్రామ సభలు నిర్వహించనున్నారు. కనుక వాటిలో జిల్లా ప్రజలు పాల్గొని తమ అభిప్రాయాలు, అభ్యంతరాలు, సలహాలు, సూచనలు లిఖిత పూర్వకంగా అందజేయాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. 

జిల్లా మండల పరిషత్ లేదా పంచాయితీ అధికారుల సమక్షంలో గ్రామ సభలలో దీనిపై చర్చించి, తీసుకున్న నిర్ణయాలను గ్రామ సర్పంచ్‌లు లేదా పంచాయితీ కార్యదర్శులు జిల్లా పంచాయితీ కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుంది. ఆ కాపీలలో పేర్కొన్న అంశాలపై మళ్ళీ ఎవరికైనా అభ్యంతరాలున్నట్లయితే జిల్లా కలెక్టర్‌కు ఆ విషయం లిఖితపూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది. వాటన్నిటినీ పరిశీలించి, పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పేరుని మార్చుతుంది.  ములుగు జిల్లాలో 9 మండలాలు, 174 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.


Related Post