మొబైల్ యాప్స్ ద్వారా విద్యుత్ బిల్లులు ఇక కుదరదు

July 02, 2024


img

దేశంలో నగదు రహిత లావాదేవీలను ప్రవేశపెట్టినప్పుడు ప్రజలు చాలా అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధికంగా నగదు రహిత లావాదేవీలు భారత్‌లోనే జరుగుతున్నాయి.

దేశంలో బిచ్చగాళ్ళు సైతం నగదు రహిత చెల్లింపులను స్వీకరిస్తున్నారంటే ఏ స్థాయిలో లావాదేవీలు జరుగుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీయం, అమెజాన్ పేవంటి మొబైల్ యాప్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంటిపన్ను, గ్యాస్ సిలిండర్, కరెంటు బిల్లులు అన్నీ వాటిద్వారానే చెల్లిస్తున్నారు. 

కానీ ఇకపై వాటి ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించవద్దని, చెల్లిస్తే వాటిని అంగీకరించబోమని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్‌పీడీసీఎల్) సీఎండీ ముషారఫ్  ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తమ అధికారిక వెబ్‌సైట్‌ లేదా మొబైల్ యాప్ ద్వారానే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే ఎస్‌పీడీసీఎల్ అధీకృత కౌంటర్లలో ఎక్కడైనా బిల్లులు చెల్లించవచ్చని తెలిపారు. వినియోగదారుల సొమ్ము, లావాదేవీలకు భద్రత కల్పించాలనే రిజర్వ్ బ్యాంక్ ఆదేశం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 

ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ త్వరలో అది కూడా ఇదే విధానంలో బిల్లు చెల్లింపులను స్వీకరించడం ఖాయమే అని భావించవచ్చు.  

నగదు రహిత లావాదేవీలలో వినియోగదారులకు మరింత భద్రత కల్పించేందుకు ‘భారత్‌ బిల్ పేమెంట్ సిస్టమ్’ ద్వారానే జరగాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు జారీ చేసింది. కనుక ఫోన్ పే, గూగుల్ పే, పేటీయం వంటి సంస్థలు, వాటి లావాదేవీలను నిర్వహిస్తున్న ప్రైవేట్ బ్యాంకులు తప్పనిసరిగా భారత్‌ బిల్ పేమెంట్ సిస్టమ్‌లో నమోదు చేసుకోవలసి ఉంటుంది.

ఒకవేళ విద్యుత్ పంపిణీ సంస్థల వెబ్‌సైట్‌ లేదా వాటి మొబైల్ యాప్‌లలో ఫోన్ పే, గూగుల్ పే, పేటీయం, అమెజాన్ పేవంటి మొబైల్ యాప్స్ కూడా ఉన్నట్లయితే అప్పుడు మాత్రం వాటి ద్వారా బిల్లు చెల్లింపులు చేయవచ్చు. 


Related Post