కవితకు మళ్ళీ నిరాశే... బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ

July 02, 2024


img

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో అరెస్ట్ అయ్యి గత మూడున్నర నెలలుగా తిహార్ జైల్లో ఉంటున్న బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ హైకోర్టులో మళ్ళీ నిరాశ తప్పలేదు. ఆమెపై ఈడీ, సీబీఐ వేర్వేరుగా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసినందున, ఆ రెండు కేసులలో బెయిల్‌ కోసం ఆమె ఢిల్లీ హైకోర్టులో వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై సోమవారం విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు రెంటినీ తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది. 

ఈడీ, సీబీఐ తరపు న్యాయవాదులు విచారణలో తమ వాదనలు వినిపిస్తూ, ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు విచారణ కీలకదశకు చేరుకుందని, కనుక ఇప్పుడు ఆమెకు బెయిల్‌ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ఆమెకు బెయిల్‌ మంజూరు చేయవద్దని వాదించారు. వారి వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఆమె రెండు పిటిషన్లను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది. 

ఈ కేసులో ఈడీ అధికారులు కల్వకుంట్ల కవితని మార్చి 15వ తేదీన హైదరాబాద్‌లో ఆమె నివాసంలో అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకువెళ్లారు. అప్పటి నుంచి ఆమె తిహార్ జైల్లోనే ఉంటున్నారు. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆమె బెయిల్‌ పిటిషన్లను ఇదే కారణంగా తిరస్కరిస్తుండటంతో ఆమె హైకోర్టుని ఆశ్రయించగా అక్కడా ఆమెకు నిరాశ తప్పడం లేదు. కనుక ఇక సుప్రీంకోర్టులో చివరి ప్రయత్నం చేసుకోవలసి ఉంటుంది. 


Related Post