సమస్యలు పరిష్కారానికి ఏపీ, తెలంగాణ సిఎంలు భేటీ కానీ...

July 02, 2024


img

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఓ లేఖ వ్రాశారు. పదేళ్ళుగా అపరిష్కృతంగా ఉన్న రాష్ట్ర విభజన సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లో కలుద్దామని దానిలో వ్రాశారు.

విభజన సమస్యలను పరిష్కరించుకొని పరస్పరం సహకరించుకౌంటూ ముందుకు సాగితే రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నానని చంద్రబాబు నాయుడు ఆ లేఖలో వ్రాశారు.

తాను తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ వ్రాసిన విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా ప్రజలకు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు లేఖపై సిఎం రేవంత్‌ రెడ్డి సానుకూలంగా స్పందించిన్నట్లు తెలుస్తోంది. కానీ అధికారికంగా ఇంకా ధృవీకరించాల్సి ఉంది. 

ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు భేటీతో విభజన సమస్యలను పరిష్కరించుకోగలిగితే మంచిదే. కానీ ఇప్పుడు రెండు రాష్ట్రాలలో ప్రతిపక్షంలోకి మారిన బిఆర్ఎస్ పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు దీనిపై రాజకీయాలు చేయకుండా ఉండవు. అక్కడ ఏపీలో వైసీపి, ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ మన రాష్ట్రాలకు అన్యాయం జరిగిపోతోందంటూ రాజకీయాలు చేయడం ఖాయం. 

నదీ జలాల పంపకాలు, షెడ్యూల్ 9, 10ల క్రింద తెలంగాణలోని ఆస్తుల పంపకాల విషయంలో బిఆర్ఎస్ పార్టీ విమర్శలు గుప్పిస్తూ రాజకీయాలు మొదలుపెట్టే అవకాశం ఉంది. అదేవిదంగా అక్కడ ఏపీ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయి ఏవిదంగా ముందుకు సాగాలో తెలియక ఇబ్బంది పడుతున్న వైసీపి కూడా విమర్శలు గుప్పిస్తూ రాజకీయాలు చేసేందుకు అవకాశం ఉంది. 

కేసీఆర్‌, జగన్‌ ఇద్దరి పరిస్థితి ఇప్పుడు ఇంచుమించు ఒకేలా ఉంది. వారిద్దరి మద్య మంచి స్నేహం కూడా ఉన్నందున వారిరువురూ కూడబలుక్కొని వ్యూహాత్మకంగా ముందుకు సాగడం ఖాయమే. ముఖ్యంగా ఓటుకి నోటు కేసు గురించి మాట్లాడుతూ ఇద్దరు ముఖ్యమంత్రులను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించవచ్చు.

చంద్రబాబు నాయుడు ట్వీట్‌ చేయగానే అప్పుడే ఓటుకి నోటు కేసుని ప్రస్తావిస్తూ కొందరు నెటిజన్స్ విమర్శలు గుప్పించడం మొదలుపెట్టేశారు కూడా. కనుక విభజన సమస్యలను పరిష్కరించుకోవడం అంత తేలిక కాదనే భావించవచ్చు. 


Related Post