ఒకేసారి రూ.626 కోట్లు పెంపా... సిఎం రేవంత్‌ షాక్!

June 30, 2024


img

కేసీఆర్‌ హయాంలో వరంగల్‌ పాత సెంట్రల్ జైలు స్థానంలో 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మాణం ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదట దానిని రూ.1,100 కోట్లు అంచనా వ్యయంతో నిర్మాణ పనులు ప్రారంభించగా, దానిని ఒకేసారి రూ.626 కోట్లు పెంచి రూ.1,726 కోట్లు పెంచిన్నట్లు తెలుసుకొని సిఎం రేవంత్‌ రెడ్డి షాక్ అయ్యారు.

నిన్న వరంగల్‌ పర్యటన సందర్భంగా హాస్పిటల్‌ నిర్మాణ పనులను పరిశీలించేందుకు వెళ్ళినప్పుడు, ఇదే విషయం గురించి అధికారులను నిలదీశారు. అయితే అంచనా వ్యయాన్ని ఒకేసారి రూ.626 కోట్లు పెంచుతూ ఎటువంటి జీవో జారీ చేయలేదని కేవలం మౌఖిక ఆదేశాలతోనే పెంచేసిన్నట్లు తెలుసుకొని సిఎం రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేవలం నోటి మాటగా ఇన్ని వందల కోట్లు నిర్మాణ వ్యయాన్ని ఏవిదంగా పెంచేశారని అధికారులను నిలదీశారు. నిర్మాణ వ్యయం పెంపుపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా ఇంకా హాస్పిటల్‌ నిర్మాణం పూర్తి కాకపోవడాన్ని సిఎం రేవంత్‌ రెడ్డి తప్పు పట్టారు. ఇకపై ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మాణ పనులను తాను స్వయంగా పర్యవేక్షిస్తుంటానని, పనులు ఆలస్యం అయితే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. 

వరంగల్‌ నగరాన్ని కూడా హైదరాబాద్‌తో సమానంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని, ముఖ్యంగా పిల్లల కోసం నీలోఫర్ హాస్పిటల్‌ వంటిది వరంగల్‌లో కూడా నిర్మించాలని, నగరంలో ఉన్న ఎంజీఎం, కాళోజీ తదితర హాస్పిటల్స్‌ అన్నిటినీ అనుసంధానం చేయాలని సిఎం రేవంత్‌ రెడ్డి సూచించారు. 

సిఎం రేవంత్‌ రెడ్డితో పాటు మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి. డిజిపి రవి గుప్తా, ఆయా శాఖల ఉన్నతాధికారులు నిన్న వరంగల్‌, హన్మకొండలో పర్యటించారు.


Related Post