మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతి

June 29, 2024


img

తెలంగాణలో ఒకే రోజు ఇద్దరు ప్రముఖ రాజకీయ నాయకులు మరణించడం దిగ్బ్రాంతి కలిగిస్తోంది. మాజీ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ శనివారం తెల్లవారుజామున మృతి చెందగా, కొన్ని గంటల ముందు అదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కూడా అనారోగ్యంతో మరణించారు.

శుక్రవారం రాత్రి ఆయన తీవ్ర అస్వస్థకు గురి కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఉట్నూర్ ఉంచి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నందున వైద్యుల సూచన మేరకు ఆదిలాబాద్‌ నుంచి అంబులెన్సులో హైదరాబాద్‌ తీసుకువస్తుండగా దారిలోనే ఇచ్కోడ వద్ద తుదిశ్వాస విడిచారు. 

రమేష్ రాథోడ్ (59) మొదటిసారిగా 1999లో ఖానాపూర్ నుంచి టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు, మళ్ళీ 2009 ఎన్నికలలో ఆదిలాబాద్‌ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆయన భార్య సుమన్ రాథోడ్ ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 

తెలంగాణ ఉద్యమాలు జోరుగా సాగుతున్నసమయంలో టిడిపిని వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత బిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్‌లో చేరి 2019 ఎన్నికలలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. దాంతో కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి 2021లో బీజేపీలో చేరారు. రమేష్ రాథోడ్ 2024 లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేద్దామనుకున్నారు కానీ టికెట్‌ లభించలేదు. 

రమేష్ రాథోడ్ ఆకస్మిక మృతిపట్ల ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌తో సహా మూడు పార్టీల నేతలు సంతాప వ్యక్తం చేస్తున్నారు. 


Related Post