అధికారిక లాంఛనాలతో డిఎస్ అంత్యక్రియలు

June 29, 2024


img

ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందిన మాజీ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సిఎం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించారు.

ఈ సందర్భంగా సిఎం రేవంత్‌ రెడ్డి ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. డీఎస్ సుదీర్గకాలం కాంగ్రెస్ పార్టీ సేవలు అందించారని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భవంతుడిని కోరుకుంటున్నానని సిఎం రేవంత్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు. 

కాంగ్రెస్‌ సీనియర్ నేత వి హనుమంతరావు, మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు పలువురు కాంగ్రెస్‌ నేతలు  హైదరాబాద్‌లో బంజారాహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్ళి డిఎస్ పార్ధివదేహానికి నివాళులు అర్పించారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ కూడా డిఎస్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. 

ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు డీఎస్ పార్ధివదేహాన్ని నిజామాబాద్‌కు తరలించనున్నారు. ప్రస్తుతం ఆయన చిన్న కుమారుడు, ఎంపీ ధర్మపురి అర్వింద్ పార్లమెంట్‌ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్నారు. తండ్రి మరణవార్త తెలియగానే హుటాహుటిన ఆయన హైదరాబాద్‌ బయలుదేరారు. రేపు మధ్యాహ్నం నిజామాబాద్‌లో డీఎస్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. 


Related Post