పాపం అలీ కల నెరవేరనేలేదు... రాజకీయాలకు గుడ్ బై!

June 29, 2024


img

ప్రముఖ తెలుగు సినీ హాస్య నటుడు అలీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ఇకపై ఏ రాజకీయ పార్టీలో చేరబోనని, సినిమాలో నటుడుగానే కొనసాగుతానని తెలిపారు. తాను కూడా ఇకపై సామాన్య ప్రజల్లాగే 5 ఏళ్ళకు ఓసారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి తప్ప మరే విదంగాను రాజకీయాలలో పాల్గొనని, ఏ పార్టీకి మద్దతు, ప్రచారం చేయనని అలీ చెప్పారు.

ప్రముఖ నిర్మాత స్వర్గీయ రామానాయుడు ప్రోత్సాహంతో నటుడుగా మారానని, ఆయన సూచన మేరకే టిడిపిలో చేరి 20 ఏళ్ళు ఆ పార్టీలో కొనసాగానని చెప్పారు. మరింతగా తన సమాజ సేవా కార్యక్రమాలు చేయవచ్చనే ఉద్దేశ్యంతోనే వైసీపిలోకి మారాను తప్ప పదవి అధికారం కోసం కాదని అలీ చెప్పారు. కానీ ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటూ, సినిమాలు, సమాజ సేవ చేసుకుంటానని అలీ చెప్పారు.      

అలీ చెప్పినాదానిలో కొంత వాస్తవం ఉన్నప్పటికీ, ఇంతకాలంగా రాజకీయాలలో ఉన్నందున ఒక్కసారైనా ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టాలని కలలుగన్నారు. టిడిపిలో ఆ కల నెరవేరకపోవడంతో వైసీపిలోకి వెళ్ళారు. ఇటీవల జరిగిన ఏపీ శాసనసభ ఎన్నికలలో అలీ రాజమండ్రి నుంచి పోటీ చేయాలని ఆశ పడ్డారు. కానీ జగన్‌ ఆయనకు టికెట్‌ ఇవ్వలేదు. నిరుపయోగమైన సలహాదారు పదవితోనే కాలక్షేపం చేయాల్సి వచ్చింది. పైగా సినీ పరిశ్రమని చాలా ఇబ్బంది పెడుతున్న జగన్‌ వెంట ఉన్నందుకు అలీకి చెడ్డ పేరు కూడా వచ్చింది.

పవన్‌ కళ్యాణ్‌తో అలీకి మంచి స్నేహం ఉంది. కనుక అలీ జనసేనలో ఉన్నా ఆయన కల నెరవేరి ఉండేది. సినీ పరిశ్రమలో ఎంతో గౌరవం ఉండేది. కానీ జగన్‌ని నమ్ముకొని అలీ అన్ని విధాలా నష్టపోయి, రాజకీయాల నుంచి తప్పుకుని మళ్ళీ తనను ఆదరించి, ఇంత పేరు ప్రతిష్టలు ఇచ్చిన సినీ పరిశ్రమలొకే తిరిగి వస్తున్నారు. అందరినీ నవ్వించిన అలీ రాజకీయ జీవితం ఈవిదంగా ట్రాజెడీగా ముగియడం బాధాకరమే.


Related Post