రెండు కార్పొరేషన్లుగా విడిపోనున్న జీహెచ్‌ఎంసీ

June 28, 2024


img

సిఎం రేవంత్‌ రెడ్డి నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఏపీ, తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్‌, అమరావతి, బిఆర్ఎస్ పార్టీ అంతర్గత రాజకీయాలు, హైదరాబాద్‌ నగరాభివృద్ధి ఇలా పలు అంశాల గురించి మాట్లాడారు. 

నగరాభివృద్ధి గురించి మాట్లాడుతూ “పరిపాలనా సౌలభ్యం కోసం జీహెచ్‌ఎంసీని రెండు కార్పొరేషన్లుగా చేయాలని నిర్ణయించాము. అలాగే హెచ్ఎండీఏ సరిహద్దులను నగరంలో అవుటర్ రింగ్ రోడ్ వరకు పెంచుతాం. రీజినల్ రింగ్ రోడ్డు వెంట మరో 24 రేడియల్ రోడ్లు నిర్మిస్తాం. అవి అందుబాటులోకి వస్తే నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రోడ్డు మార్గంలో అరగంటలో చేరుకోవచ్చు. 

డ్రైపోర్టుల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. సీ పోర్టుల నుంచి కంటెయినర్లు నేరుగా అక్కడికి చేరుకునేందుకు వీలుగా గ్రీన్ సిగ్నల్‌ ఫీల్డ్ హైవేలు నిర్మిస్తాము. అన్ని జిల్లా కేంద్రాలకు అవుటర్ రింగ్ రోడ్లు నిర్మిస్తాము. 

హైదరాబాద్‌ నగరాన్ని కూడా రాజస్థాన్‌ రాష్ట్రంలాగా వెడ్డింగ్ డెస్టినేషన్ సిటీగా మార్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తాము,” అని సిఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు.          

బిఆర్ఎస్ పార్టీ రాజకీయాల గురించి మాట్లాడుతూ, “హరీష్ రావు కేసీఆర్‌ని పక్కదారి పట్టిస్తున్నారు. ఏపీలో జగన్మోహన్‌ రెడ్డి చంద్రబాబు నాయుడుని ఎంతగా వేధించినా కోర్ రాజకీయాలు వీడిచిపెట్టకుండా పనిచేస్తూ మళ్ళీ అధికారంలోకి రాగలిగారు.

కానీ కేసీఆర్‌ ఎంతసేపు మా ప్రభుత్వాన్ని కూల్చేయడం ఎలా? మళ్ళీ అధికారంలోకి రావడం ఎలా? అని మాత్రమే ఆలోచిస్తున్నారు తప్ప మళ్ళీ ప్రజల మద్యకు వెళ్ళి మమేకం కాలేకపోతున్నారు. ఆయన ధోరణితోనే బిఆర్ఎస్ పార్టీ తుడిచి పెట్టుకుపోతోంది. కనుక కేసీఆర్‌ విధానాలను బట్టే మా రాజకీయాలు కూడా ఉంటాయని గ్రహిస్తే మంచిది,” అని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.


Related Post