నాకు ఇచ్చిన టాస్క్ పూర్తి చేశా: సిఎం రేవంత్‌

June 28, 2024


img

సిఎం రేవంత్‌ రెడ్డి నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావలని మా అధిష్టానం నాకు ఇచ్చిన టాస్క్ పూర్తి చేశాను. కనుక నా స్థానంలో పిసిసి అధ్యక్షుడుగా మరొకరిని నియమించమని కోరాను. దీని గురించి ఆలోచించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మా అధిష్టానం చెప్పింది,” అన్నారు. 

కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ ఏర్పాటు చేసినప్పటికీ 10 ఏళ్ళపాటు తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాలేకపోయింది. కేసీఆర్‌ ధాటికి సీనియర్ కాంగ్రెస్‌ నేతలు సైతం చేతులు ఎత్తేశారు. కేసీఆర్‌ని ఓడించడం అసాధ్యమని అందరూ భావిస్తున్న సమయంలో కాంగ్రెస్‌ అధిష్టానం రేవంత్‌ రెడ్డిని పిసిసి అధ్యక్షుడుగా నియమించింది. కానీ పార్టీలో కొందరు సీనియర్ నాయకులు ఆయన నాయకత్వాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ వారందరినీ కలుపుకుపోతూ ఎదురేలేదనుకున్న కేసీఆర్‌ని శాసనసభ ఎన్నికలలో ఓడించారు. 

పిసిసి అధ్యక్షుడుగా రేవంత్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టి జూలై 7నాటికి మూడేళ్ళు పూర్తవుతుంది. కాంగ్రెస్‌ నిబందనల ప్రకారం పిసిసి అధ్యక్ష పదవీ కాలం మూడేళ్ళే. కనుక కాంగ్రెస్‌ అధిష్టానం కోరుకుంటే రేవంత్‌ రెడ్డినే కొనసాగించవచ్చు. కానీ రేవంత్‌ రెడ్డి స్వయంగా తన స్థానంలో మరొకరిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. కనుక జూలై 7వ తేదీలోగా తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. కొత్త పిసిసి అధ్యక్షుడుగా కాంగ్రెస్‌ అధిష్టానం ఎవరిని నియమిస్తుందో త్వరలోనే ప్రకటించనుంది. 


Related Post