అప్పుడప్పుడు అలాంటి తమాషాలు జరుగుతుంటాయి: కేసీఆర్‌

June 28, 2024


img

మాజీ సిఎం, బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ గురువారం ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో తనను కలిసేందుకు వచ్చిన పార్టీ కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “రాజకీయ పార్టీలకు గెలుపోటములు తప్పవు.

కనుక ఓడిపోయినప్పుడు క్రుంగిపోకుండా ప్రజల మద్యనే ఉంటూ వారి సమస్యలపై పోరాటాలు చేస్తూ ఉంటే ఏదో రోజు ప్రజలే మనల్ని ఆదరిస్తారు. మళ్ళీ మనల్ని ఎన్నికలలో గెలిపించి అధికారం కట్టబెడతారు. గతంలో ఎన్టీఆర్‌ కూడా ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొన్నప్పుడు ఆయన నిరాశ చెందకుండా పట్టుదలగా పొరాడి మళ్ళీ అధికారంలోకి రాగలిగారు. మనం కూడా అలాగే పట్టుదలగా పనిచేస్తూనే ఉండాలి. 

మనకి అధికారం కంటే తెలంగాణ రాష్ట్రాభివృద్ధి ముఖ్యం. పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అదే లక్ష్యంతో పని చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకున్నాము. కానీ ఎన్నికలలో ప్రజలు మనం ఊహించని తీర్పు ఇచ్చారు. ఎన్నికలలో కొన్నిసార్లు ఇలాంటి తమాషాలు జరుగుతుంటాయి. 

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే మళ్ళీ సమస్యలు మొదలైపోయాయి. మనం ఎంతో కష్టపడి అభివృద్ధి చేసిన తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్‌ పాలనలో అప్పుడే గాడి తప్పింది. సాగు త్రాగు నీళ్ళ కష్టాలు, కరెంట్ కష్టాలు మళ్ళీ మొదలవడంతో ప్రజలు కూడా కాంగ్రెస్‌ పాలన పట్ల విసుగెత్తిపోయారు. 

కనుక మనం కష్టపడి పనిచేస్తే ప్రజలు తప్పకుండా మనల్ని ఆదరిస్తారు. కానీ అంతవరకు ఓపిక పట్టలేని కొందరు పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. అటువంటివారు వెళ్ళిపోయినా పార్టీకి నష్టం లేదు,” అని కేసీఆర్‌ చెప్పారు.


Related Post