ఢిల్లీలో కొత్త తెలంగాణ భవన్‌ నిర్మిస్తాం: మంత్రి వెంకట్ రెడ్డి

June 28, 2024


img

ఏపీ జితేందర్ రెడ్డి గురువారం ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ఢిల్లీలో రూ.400-500 కోట్లు వ్యయంతో కొత్తగా తెలంగాణ భవన్‌ నిర్మిస్తాం.

ఇప్పటికే రెండు ఆర్కిటెక్ట్ కంపెనీలు డిజైన్లు సమర్పించాయి. వాటిలో కొన్ని మార్పులు చేర్పులు సూచించాము. అవి చేతికి వచ్చాక సిఎం రేవంత్‌ రెడ్డి వాటిలో ఒక దానిని ఎంపిక చేయగానే టెండర్లు పిలిచి రెండు నెలల్లోగా నిర్మాణ కార్యక్రమాలు మొదలు పెట్టి రెండేళ్ళలోగా పూర్తి చేస్తాము. 

ఢిల్లీలో తెలంగాణ భవన్‌ చాలా ప్రత్యేకంగా కనబడేలా నిర్మిస్తాము. అలాగని హంగు ఆర్భాటాలకు పోకుండా సింపుల్‌గా అందరిని ఆకట్టుకునేలా నిర్మిస్తాము. హైదరాబాద్‌ హౌస్ పక్కనే నిర్మించబోతున్న దీనికి సమీపంలోనే గవర్నర్‌, సిఎంల కోసం రెండు భవనాలు కూడా నిర్మిస్తాము,” అని చెప్పారు. 

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఢిల్లీలో ఏపీ భవన్‌ పరిధిలో గల 19 ఎకరాలను రాష్ట్ర విభజన చట్టం ప్రకారం విభజించి ఇవ్వాలని కోరింది. వెంటనే స్పందించిన కేంద్ర ప్రభుత్వం దానిలో 42% భూమిని తెలంగాణ రాష్ట్ర వాటాగా కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

దీంతో ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రానికి సుమారు 7.9 ఎకరాల విస్తీర్ణం గల భూమి అందుబాటులోకి వచ్చింది. దానిలోనే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భవన్‌ నిర్మించబోతోంది. 


Related Post