ఫోన్ ట్యాపింగ్‌ కేసులో ఆ ముగ్గురికీ నో బెయిల్‌

June 27, 2024


img

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో అరెస్ట్ అయిన ముగ్గురు పోలీస్ అధికారులు ప్రణీత్ రావు, భుజంగ రావు, తిరుపతన్నలకు నాంపల్లి కోర్టు బెయిల్‌ తిరస్కరించింది. వారు ముగ్గురిపై విచారణ జరుపుతున్న సిట్ బృందం నిబందనల ప్రకారం 90 రోజులలో కోర్టులో ఛార్జ్ షీట్ వేయనందున, ఆటోమెటిక్‌గా తమకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ వారు ముగ్గురూ పిటిషన్‌ వేశారు. 

దానిపై నాంపల్లి కోర్టు బుధవారం విచారణ జరిపినప్పుడు పోలీస్ శాఖ తరపు న్యాయవాది తాము కొన్ని రోజుల క్రితమే కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన విషయాన్ని గుర్తుచేసి, అది సరిగా లేదని కోర్టు చెప్పడంతో వెనక్కు తీసుకొని మళ్ళీ దాఖలు చేశామని వాదించారు. కనుక నిబందనల ప్రకారం 90 రోజుల లోపే ఛార్జ్ షీట్ దాఖలు చేశామని కనుక ఈ నిబందన కింద నిందితులకు బెయిల్‌ మంజూరు చేయరాదని వాదించారు. 

ఇరు పక్షాల వాదనలు పూర్తయిన తర్వాత తీర్పుని రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించిన న్యాయస్థానం, ఈరోజు తీర్పు వెల్లడించింది. పోలీసుల తరపున న్యాయవాది వాదనలతో ఏకీభవిస్తూ, నిందితుల బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరిస్తున్నట్లు తీర్పు చెప్పారు.    



Related Post