నాడు కేసీఆర్‌ ఫిరాయింపులను ప్రోత్సహించారుగా...

June 27, 2024


img

బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై ఆ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలకు సిఎం రేవంత్‌ రెడ్డి ఘాటుగా బదులిచ్చారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “ఆనాడు మీకు పూర్తి మెజార్టీ ఉన్నా మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మీ పార్టీలోకి ఫిరాయింపజేసుకోలేదా?అప్పుడు తప్పు కానప్పుడు ఇప్పుడు తప్పు ఎలా అవుతుంది. ఒకవేళ తప్పనుకుంటే కేసీఆర్‌ ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలి. 

మా ప్రభుత్వాన్ని కూల్చేసి మళ్ళీ అధికారంలోకి రావాలని కేసీఆర్‌ దురాలోచనలు చేస్తూ మళ్ళీ నీతులు వల్లించడం సిగ్గుచేటు. అసలు ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకోవడమే కేసీఆర్‌ భావదారిద్యం అనుకోవచ్చు. శాసనసభ,లోక్‌సభ ఎన్నికలలో వరుసగా రెండుసార్లు ఓడిపోయినా కేసీఆర్‌ బుద్ధి మారలేదు. 

లోక్‌సభ ఎన్నికలలో మా పార్టీకి నష్టం కలిగించేందుకే కేసీఆర్‌ బిఆర్ఎస్ పార్టీని ఓడించుకొని బీజేపీని గెలిపించారు. లేకుంటే బిఆర్ఎస్ పార్టీకి కంచుకోట అని చెప్పుకునే మెదక్, సిరిసిల్లా, సిద్ధిపేట జిల్లాలలో బీజేపీకి అన్ని ఓట్లు ఎలా వచ్చాయో కేసీఆరే చెప్పాలి. 

అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌కి మంత్రులు, ఎమ్మెల్యేలు కంటికి కానలేదు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్యేలను ఫామ్‌హౌస్‌కి ఆహ్వానించి మీకు ఏ అవసరం ఉన్నా తీరుస్తా... ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతానని నమ్మబలుకుతున్నారు. 

విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై శాసనసభలో చర్చిస్తున్నప్పుడు మీ జగదీష్ రెడ్డే కదా కమీషన్‌ వేసి విచారణ జరిపించమని సవాలు విసిరారు. ఇప్పుడు కమీషన్‌ విచారణకు పిలిస్తే భయం ఎందుకు? ఏ తప్పు చేయకపోతే కేసీఆర్‌ ధైర్యంగా కమీషన్‌ ఎదుట హాజరయ్యి తన వాదనలు వినిపించవచ్చు కదా? కానీ రాకుండా హైకోర్టుకి ఎందుకు వెళ్ళారు?

మా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాస్త అసంతృప్తి చెందితే, దానినీ తమకు అనుకూలంగా మలుచుకొని రాజకీయాలు చేయాలనుకోవడం సిగ్గు చేటు. ఆయన మా పార్టీలో సీనియర్ నేత. ఆయనకు పార్టీలో ఎప్పుడూ సముచిత గౌరవం, ప్రాధాన్యత ఉంటాయి,” అని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.


Related Post