ఆసిఫాబాద్ జిల్లాలో వంతెన కొట్టుకుపోయింది...

June 23, 2024


img

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్‌ మండలం, అందేవెల్లి గ్రామం వద్ద పెద్దవాగుపై నిర్మించిన తాత్కాలిక వంతెన రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొట్టుకుపోయింది. దీంతో అటు కాగజ్ నగర్, ఇటు దహేగాం మండలలోని సుమారు 50 గ్రామాల మద్యన రాకపోకలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

రెండేళ్ల క్రితం పాత వంతెన క్రుంగిపోవడంతో దానికి మరమత్తులు చేసేందుకు తాత్కాలికంగా మరో చిన్న వంతెన ఏర్పాటు చేశారు. కానీ వంతెనకు మరమత్తులు చేస్తున్న గుత్తేదారుకి రోడ్లు భవనాల శాఖ నిధులు విడుదల చేయకపోవడంతో అప్పటి నుంచి మరమత్తు పనులు నత్తనడకన సాగుతున్నాయి. 

కనుక అప్పటి నుంచి పెద్దవాగుకి ఇరువైపుల గ్రామాల ప్రజలు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంతెనపై నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. కానీ ఇప్పుడు అదీ కూలిపోవడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. 

పదేళ్ళ కేసీఆర్‌ పాలనలో ఒక్క హైదరాబాద్‌ నగరంలో కేబిల్ బ్రిడ్జి, స్టీల్ బ్రిడ్జితో సహా సుమారు 35 ఫ్లైఓవర్‌లు నిర్మించారు. వరంగల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, సిరిసిల్లా తదితర జిల్లాలలో కూడా ఫ్లైఓవర్‌లు నిర్మించారు. కానీ ఇటువంటి మారుమూల గ్రామాలను పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. అందుకే రెండేళ్ళుగా పాత వంతెనకు మరమత్తులు కూడా పూర్తికాలేకపోయాయి. 

కనీసం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం మారుమూల గ్రామాల ప్రజల కోసం తక్షణమే మరో తాత్కాలిక వంతెనను ఏర్పాటు చేయించి పాత వంతెనకు మరమత్తులు పూర్తి చేయిస్తే బాగుంటుంది. 


Related Post