పార్టీ మారే ప్రసక్తే లేదు: గంగుల

June 23, 2024


img

గత కొన్ని రోజులుగా బిఆర్ఎస్‌ కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇద్దరూ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ మీడియా, సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పటికే వాటిని ఖండించగా, తాజాగా గంగుల కమలాకర్‌ కూడా వాటిని ఖండించారు. 

శనివారం కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ, “కొంతమంది నన్ను వ్యక్తిగతంగా, రాజకీయంగా అప్రదిష్టపాలు జెసేందుకే పనిగట్టుకుని ఈవిదంగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఇంతకు ముందు నేను బీజేపీలో చేరుతున్నానని పుకార్లు పుట్టించినవారే ఇప్పుడు నేను సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నానంటూ పుకార్లు పుట్టించారు.

కానీ నేను ఆదివారమే విదేశీయాత్రలకు వెళుతున్నాను. అక్కడే ఓ పది రోజులు ఉంటాననే విషయం పుకార్లు పుట్టించినవారికి బహుశః తెలిసి ఉండదు. నేను బిఆర్ఎస్‌ పార్టీలోనే ఉంటాను. కేసీఆర్‌ నాయకత్వంలోనే పనిచేస్తాను. ఏ పార్టీలోకి మారే ప్రసక్తే లేదు,” అని చెప్పారు.     

లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్‌ పార్టీ ఘోర పరాజయం పాలవగా, రాష్ట్రంలో మరో నాలుగున్నరేళ్ళ వరకు ఎన్నికలు జరుగవు. కనుక బిఆర్ఎస్ పార్టీలో అంతకాలం ఓపిక పట్టలేనివారు త్వరలోనే పార్టీని వీడి బయటకు వచ్చేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. వారిని బయటకు రప్పించి పార్టీలో రప్పించేందుకు బహుశః కాంగ్రెస్‌, బీజేపీలు ఈవిదంగా మైండ్ గేమ్స్ ఆడుతున్నట్లున్నాయి. 


Related Post