ఛత్తీస్‌ఘడ్‌ విద్యుత్: కేసీఆర్‌ చెప్పినవి పొంతన లేని లెక్కలేనట!

June 18, 2024


img

ఛత్తీస్‌ఘడ్‌ నుంచి 1,000 మెగావాట్స్ విద్యుత్ కొనుగోలుని మాజీ సిఎం కేసీఆర్‌ గట్టిగా సమర్ధించుకోవడమే కాకుండా దానిపై జస్టిస్ నరసింహా రెడ్డి కమీషన్‌కు విచారణ చేపట్టడాన్ని కూడా తీవ్రంగా తప్పు పడుతూ ఓ లేఖ వ్రాశారు. 

అయితే కేసీఆర్‌ చెప్పిన్నట్లు ఛత్తీస్‌ఘడ్‌ నుంచి ఒక యూనిట్ ధర రూ.3.90లకే ఒప్పందం చేసుకున్నప్పటికీ, అక్కడి నుంచి తెలంగాణకు విద్యుత్ సరఫరా కోసం పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌కు చెందిన హైవోల్టేజ్ విద్యుత్ సరగరా లైన్స్ అద్దె ఛార్జీలు రూ.3638 కోట్లు, విద్యుత్ పంపిణీ ఛార్జీలు రూ.1,362 కోట్లు కలిపి ఒక్కో యూనిట్‌కు రూ.5.64 పడింది. ఇది మార్కెట్లో లభించే విద్యుత్ కంటే చాలా ఎక్కువని డిస్కమ్‌లు తేల్చిచెప్పాయి. 

ఈ అధనపు భారం తమపైనే పడిందని డిస్కమ్‌లు తెలియజేశాయి. ఛత్తీస్‌ఘడ్‌ నుంచి అదనంగా మరో 1,000 మెగావాట్స్ విద్యుత్ సరఫరా తీసుకునేందుకుగాను పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌ లైన్స్ రిజర్వ్ చేసుకునేందుకుగాను ముందుగానే రూ.261 కోట్లు కట్టేందుకు అంగీకరించింది. 

కానీ ఛత్తీస్‌ఘడ్‌ నుంచి తెలంగాణకు ఈ లైన్స్ ద్వారా 2017 నుంచి 2022 వరకు 17,996 మిలియన్ యూనిట్స్ మాత్రమే సరఫరా అయ్యింది. ఆ తర్వాత బకాయిల చెల్లింపు విషయంలో ఛత్తీస్‌ఘడ్‌తో వివాదం మొదలవడంతో 2022 ఏప్రిల్‌ నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 

ఛత్తీస్‌ఘడ్‌కు ఇంకా రూ.1.081 కోట్లు చెల్లించవలసి ఉందని తెలంగాణ డిస్కంలు చెపుతుండగా, రూ.1,715 కోట్లు బాకీ ఉందని ఛత్తీస్‌ఘడ్‌ వాదిస్తూ అప్పీలేట్ ట్రిబ్యూనల్‌లో పిటిషన్‌ వేసింది. 

దీనికి తోడు పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌ లైన్స్ ముందే రిజర్వ్ చేసుకునందున ఆ బకాయి రూ.261 కోట్లు చెల్లించాలని ఆ సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి నోటీస్ పంపింది.   

ఛత్తీస్‌ఘడ్‌ నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రూ.2.083 కోట్లు చెల్లించి బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయవలసి వచ్చిందని డిస్కమ్‌లు తెలియజేశాయి. ఈ అదనపు భారం అంతా తమపైనే పడిందని ఈ ఒప్పందం వలన సుమారు రూ.6,000 కోట్లు నష్టం వచ్చిన్నట్లు డిస్కంలు తెలియజేశాయి.  

కేసీఆర్‌ తన లేఖలో ఛత్తీస్‌ఘడ్‌ ప్రభుత్వం వెయ్యి మెగావాట్స్ విద్యుత్ కొనుగోలుకి రాష్ట్ర విద్యుత్ నియంత్రణా మండలి (ఈఆర్‌సీ) ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. కానీ తాము మద్యంతర ఉత్తర్వులు మాత్రమే ఇచ్చామని, ఆ తర్వాత డిస్కంలు పిటిషన్‌ ద్వారా తన ఆమోదం పొందాల్సి ఉండగా నేటికీ తీసుకోలేదని ఈఆర్‌సీ స్పష్టం చేసింది.            

కనుక ఛత్తీస్‌ఘడ్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చాలా ఖరీదైన వ్యవహారమే కాక, అనేక వివాదాలు కూడా ఎదుర్కోవలసి వస్తోందని డిస్కంలు తెలియజేశాయి. కనుక ఇప్పుడు జస్టిస్ నరసింహా రెడ్డి కమీషన్‌ తెలంగాణ ప్రభుత్వానికి ఏవిదంగా నివేదిక సమరిస్తుందో, దానిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో రాబోయే రోజుల్లో తెలుస్తుంది. 


Related Post