టిజిఎస్‌ఆర్టీసీలో 3,035 ఉద్యోగాలకు భర్తీకి గ్రీన్ సిగ్నల్‌

July 03, 2024
img

టిజిఎస్‌ఆర్టీసీలో చివరిసారిగా 2012లో ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. అప్పటి నుంచి ఈ 12 ఏళ్ళలో అనేకమంది ఉద్యోగులు పదవీ విరమణ చేస్తూనే ఉన్నారు. కానీ ఆ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతించకపోవడంతో సంస్థలో మిగిలిన ఉద్యోగులపై ఆ భారం పడుతోంది.

కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పధకం అమలుచేయడం మొదలుపెట్టినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ బస్సులలో మహిళా ప్రయాణికుల సంఖ్య దాదాపు మూడింతలు పెరిగింది. ఈ కారణంగా సిబ్బందిపై మరింత పని భారం పెరిగింది.

ఈ సమస్యలపై దృష్టి పెట్టిన రవాణాశాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్‌, సిఎం రేవంత్‌ రెడ్డితో మాట్లాడి 3,035 పోస్టుల భర్తీకి ఒప్పించారు.

వాటిలో అత్యధికంగా 2,000 డ్రైవర్ పోస్టులు, 783 శ్రామిక్ (మెకానిక్స్) పోస్టులే ఉన్నాయి. కండెక్టర్ పోస్టులను కారుణ్య నియామకాల ద్వారా భర్తీ చేసుకోవాలని టిజిఎస్‌ఆర్టీసీ భావిస్తుండటంతో ఆ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపలేదు. 

రవాణా మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్‌ మీడియాతో మాట్లాడుతూ, “టిజిఎస్‌ఆర్టీసీలో మళ్ళీ 12 ఏళ్ళ తర్వాత ఒకేసారి ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాము. ఈ ఉద్యోగాల భర్తీతో టిజిఎస్‌ఆర్టీసీపై సుమారు రూ.100.80 కోట్ల అదనపు భారం పడుతుంది. మహాలక్ష్మి పధకం ప్రవేశపెట్టినప్పటి నుంచి రద్దీ బాగా పెరిగినందున త్వరలోనే కొత్త బస్సులు కొనుగోలు చేయబోతున్నాము,” అని చెప్పారు.

Related Post