నిరుద్యోగులకు ఇక ఎదురుచూపులు అవసరం లేదు

July 02, 2024
img

తెలంగాణలో నిరుద్యోగులు ఇకపై ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఏళ్ళ తరబడి ఎదురు చూడనవసరం లేదు. మరో రెండు వారాలలో టీజీపీఎస్‌ఎస్సీ జాబ్ క్యాలండర్ ప్రకటించబోతోంది. సిఎం రేవంత్‌ రెడ్డి ఆదేశం మేరకు వివిద శాఖలలో రాబోయే మూడేళ్ళ పదవీ విరమణ చేసేవారి వివరాలను సేకరించడం ప్రారంభించింది.

టీజీపీఎస్‌ఎస్సీ భర్తీ చేసే ఉద్యోగాలతో పాటు, పాఠశాల విద్యాశాఖ, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు శాఖ, వైద్య ఆరోగ్యశాఖలలో ఖాళీలను కూడా గుర్తించి, వాటి నోటిఫికేషన్‌ తేదీలను కూడా జాబ్ క్యాలండర్‌లో చేర్చబోతున్నారు. 

కనుక ఇకపై ఏడాదిలో ఎప్పుడు ఏ శాఖలలో ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వెలువడబోతోందనే విషయం ముందుగానే జాబ్ క్యాలండర్‌లో తెలుస్తుంది. నోటిఫికేషన్‌ వెలువడే తేదీ మొదలు నియామక పత్రాలు అందించేవరకు మొత్తం షెడ్యూల్ ఈ జాబ్ క్యాలండర్‌లో పొందుపరిచి దానిని యదాతధంగా అమలుచేయాలని సిఎం రేవంత్‌ రెడ్డి భావిస్తున్నారు. 

అదే కనుక చేయగలిగితే రాష్ట్రంలో వివిద జిల్లాల నుంచి హైదరాబాద్‌ వచ్చి హాస్టల్స్‌లో ఉంటూ వాటి కోసం కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకునే యువతపై అనవసరపు ఒత్తిడి, వారి కుటుంబాలపై ఆర్ధికభారం రెండూ తగ్గుతాయి. జాబ్ క్యాలండర్‌ని బట్టి నిరుద్యోగ యువత ప్లాన్ చేసుకోవచ్చు.

Related Post