మహిపాల్ రెడ్డి కేసులో కూడా కేసీఆర్ మౌనం?

July 04, 2024


img

పటాన్‌చెరు బిఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి బుధవారం మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన, సోదరుడు మధుసూధన్ రెడ్డి అక్రమ మైనింగ్ చేస్తూ భారీగా అక్రమస్తులు పోగేసుకున్నారని ఈడీ అధికారులు కొన్ని రోజుల క్రితం, వారి ఇళ్ళలో, వారి బంధువుల ఇళ్ళలో సోదాలు నిర్వహించారు. 

మహిపాల్ రెడ్డిపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు, సోదాలలో లభించిన బ్యాంక్ డాక్యుమెంట్లు, ఇతర సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత బుధవారం మరోసారి ఆయనను ప్రశ్నించారు. ఆ తర్వాత ఆయనను వెంటబెట్టుకొని పటాన్‌చెరులో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తీసుకువెళ్ళి, దానిలో ఆయన పేరిట తీసుకున్న లాకర్ తెరిపించారు. దానిలో 1.2 కేజీల బంగారం లభించింది. దాని కొనుగోలుకి సంబందించి ఎటువంటి రసీదులు, ఆధారాలు లేకపోవడంతో ఈడీ అధికారులు ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

సాధారణంగా ఈడీ, సీబీఐలు సోదాలకు వస్తే రాజకీయ నాయకులు అది కక్ష సాధింపు చర్యలే అంటూ వాదిస్తుంటారు. కానీ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి స్పందించడమే లేదు. 

గత కొన్ని రోజులుగా ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో పార్టీ నేతలు, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న కేసీఆర్‌, పార్టీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా నేరుగా తనను సంప్రదించమని, తాను వారికి అండగా నిలబడి అవసరమైన సాయం చేస్తానని చెపుతున్నారు. కానీ తమ పార్టీ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఈ కేసులో ఇరుకుంటే కానీ, కేసీఆర్‌, కేటీఆర్‌ తదితరులు ఎవరూ స్పందించడం లేదు. వారి మౌనానికి అర్దం ఏమిటో?


Related Post