కాంగ్రెస్‌కు ప్రజల చేత ఛీ కొట్టించుకునే అలవాటుంది: కేసీఆర్‌

July 03, 2024


img

బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలతో వరుసగా సమావేశమవుతూ వారికి ధైర్యం చెపుతున్నారు. కష్టకాలంలో పార్టీని విడిచిపెట్టిపోవడం సరికాదని, కాస్త ఓపిక పట్టి ధైర్యంగా పోరాడుతూ ముందుకు సాగితే తప్పకుండా మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని నచ్చజెపుతున్నారు. మంగళవారం ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లతో కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

“కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా పిచ్చిపిచ్చి పనులు చేస్తూ ప్రజల చేత ఛీకొట్టించుకునే దూరాలవాటు ఉంది. గతంలో ఎన్టీఆర్‌ తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు, మళ్ళీ ఇప్పుడూ ఆలాగే చేస్తోంది. కనుక ఈసారి మనం అధికారంలోకివస్తే రాబోయే 15 ఏళ్ళు మనమే అధికారంలో కొనసాగుతాము,” అని కేసీఆర్‌ అన్నారు. 

కాంగ్రెస్‌ గురించి మరో వ్యంగోక్తి కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీని వేరే ఏ పార్టీ ఓడించలేదు. అది తనను తాను ఓడించుకున్నప్పుడు మాత్రమే వేరే పార్టీ గెలుస్తుంటుంది,” అని. గతంలో పదేళ్ళ యూపీయే పాలన అవినీతి, అక్రమాలు, అసమర్దతకు మారుపేరుగా మారి ప్రజల చేత ఛీకొట్టించుకొని దిగిపోవడం అందరూ చూశారు. సమైక్య రాష్ట్రంలో కూడా కాంగ్రెస్‌ అవినీతి, అసమర్ధ పాలనతో ప్రజలు వేసారిపోయారు. 

తెలంగాణ ఉద్యమాలు మొదలవడానికి ఇదీ ఓ కారణమే అని చెప్పవచ్చు. ఇప్పుడు భారీ అంచనాలతో రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాజ్యం ఏలుతోంది. ఈ ఆరు నెలల్లో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై పట్టుసాధించగలిగారు కానీ ఇంతవరకు తన మార్క్ పాలన మొదలుపెట్టనే లేదు. 

రాష్ట్రాభివృద్ధి పనులు ఇంకా మొదలుపెట్టనే లేదు. ఇంతవరకు రాష్ట్రానికి పెద్దగా పరిశ్రమలు, పెట్టుబడుల ఆకర్షించలేకపోయారనే చెప్పాలి. మరో ఆరు నెలల్లోగా రేవంత్‌ రెడ్డి ఇవన్నీ సాధించి చూపాల్సి ఉంటుంది. లేకుంటే బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకోవడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు.


Related Post