మంత్రివర్గ విస్తరణ: ఢిల్లీకి వెళ్ళాల్సిందేనా?

July 03, 2024


img

ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉంటే వాటి అధినేతలు రాష్ట్ర స్థాయిలోనే నిర్ణయాలు తీసుకోగలరు. కానీ జాతీయ పార్టీలైతే వాటి రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రులు, మంత్రులు, నేతలు తప్పనిసరిగా తరచూ ఢిల్లీలోని తమ అధిష్టానం  చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సిందే. రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కూడా అదే చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ చేపట్టాలనుకున్నప్పటి నుంచి తరచూ ఢిల్లీ వెళ్ళి వస్తూనే ఉన్నారు. 

ఇప్పటికే రెండుసార్లు వెళ్ళి వచ్చారు. మంత్రుల పేర్లు దాదాపు ఖరారు అయిపోయిన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ మళ్ళీ ఇదే అంశాపై పార్టీ అధిష్టానంతో చర్చించేందుకు బుధవారం మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. 

మంత్రివర్గ విస్తరణతో పార్టీ, ప్రభుత్వం బలపడిన్నట్లే, మంత్రి పదవులు ఆశించి భంగపడినవారి వలన నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది. బిఆర్ఎస్ పార్టీ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ప్రస్తుతం కాంగ్రెస్‌ బలం కాస్త పెరిగినప్పటికీ, మంత్రివర్గ విస్తరణతో అసంతృప్తి చెందే నేతలు బయటకు వెళ్ళిపోతే పరిస్థితి మళ్ళీ మొదటికొస్తుంది. అందుకే మంత్రివర్గ విస్తరణ మరింత ఆచితూచి చేయాల్సివస్తోంది.      

ప్రస్తుతం సిఎం రేవంత్‌ రెడ్డితో కలిపి మొత్తం 12 మంది ఉండగా మరో అరుగురిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు. కనుక పార్టీలో మంత్రి పదవులు ఆశిస్తున్నవారు డజను మందికి పైనే ఉన్నారు. వారిలో ఎవరెవరికి అవకాశం లభిస్తుందనే విషయం నేటి సమావేశంలో తేలిపోవచ్చు. 


Related Post