విభజన సమస్యలను వివాదాలుగా మార్చి...

July 03, 2024


img

ఏపీ, తెలంగాణ విభజన సమస్యలపై చర్చించేందుకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్‌ రెడ్డి ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లోని జ్యోతీరావు ఫూలే భవన్‌లో ముఖాముఖి సమావేశం కానున్నారు.

ఈ సమస్యలను పరిష్కరించుకుందామని సిఎం రేవంత్‌ రెడ్డి ముందుగా ప్రతిపాదించారు. ఏపీ సిఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందిస్తూ తాను హైదరాబాద్‌ వచ్చి విభజన సమస్యలపై ముఖాముఖి సమావేశమై చర్చించి సామరస్యంగా పరిష్కరించుకుందామంటూ జూలై 1వ తేదీన సిఎం రేవంత్‌ రెడ్డికి లేఖ వ్రాశారు.

సిఎం రేవంత్‌ రెడ్డి కూడా సానుకూలంగా స్పందిస్తూ, ఆ రోజు మధ్యాహ్నం హైదరాబాద్‌లో జ్యోతీరావు ఫూలే భవన్‌లో ముఖాముఖీ సమావేశమవుదామని బదులిచ్చారు.

పదేళ్ళుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకోగలిగితే రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంతో మేలు కలుగుతుంది. కానీ మాజీ సిఎంలు కేసీఆర్‌, జగన్‌ మద్య మంచి సఖ్యత ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించుకోకుండా ఆలాగే అట్టేబెట్టుకొని ఈ వివాదాలతో సెంటిమెంట్ రాజేసుకుంటూ తమ పార్టీల రాజకీయ మైలేజి కలిగేలా చేసుకుంటున్నారు.

తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు, ఏపీ సిఎంగా ఉన్న జగన్‌ తన అధికారులను, పోలీసులను సాగర్ డ్యామ్ మీదకు పంపించి 32 గేట్లు కబ్జా చేయించడం, అప్పుడు ఏపీ, తెలంగాణ అధికారులు, పోలీసులు గొడవపడటం బహుశః అందరికీ గుర్తుండే ఉంటుంది.

ఇటువంటి సమస్యలను పరిష్కరించుకుని తమతమ రాష్ట్రాలకు ప్రయోజనం కలిగించే బదులు వాటిని వివాదాలుగా మార్చి ఈవిదంగా రెండు పార్టీలు పరస్పరం రాజకీయ ప్రయోజనాలు కలిగించుకునేందుకు ఉపయోగించుకోవడం దురదృష్టకరమే.

కనుక ఇప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని సమస్యలపై చర్చించుకుని పరిష్కరించుకోవాలని అనుకోవడం చాలా శుభపరిణామమే అని చెప్పవచ్చు. కానీ దీనిపై కూడా మళ్ళీ బిఆర్ఎస్, వైసీపిలు రాజకీయాలు చేయకుండా ఉండవు.   


Related Post