హన్మకొండ బిఆర్ఎస్ కార్యాలయానికి కార్పొరేషన్ నోటీస్

July 02, 2024


img

బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీకి ప్రతీ జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం 3 ఎకరాల స్థలం కేటాయించుకుంది. అన్ని జిల్లా కేంద్రాలలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు కూడా నిర్మించుకుంది.

అయితే ప్రభుత్వం మారడంతో ఇప్పుడు వరంగల్‌ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు హనుమకొండ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి నోటీసులు పంపారు. జూన్ 25వ తేదీన పంపిన నోటీసులో అక్కడ పార్టీ కార్యాలయ భవనానికి స్థలం కేటాయింపు, భవన నిర్మాణానికి ఎటువంటి అనుమతులు లేనందున అక్రమ కట్టడంగా పరిగణిస్తున్నామని పేర్కొంది.

ఒకవేళ బిఆర్ఎస్ పార్టీ వద్ద అనుమతి పత్రాలు ఉన్నట్లయితే తక్షణమే కార్పొరేషన్‌కు సమర్పించాలని, లేకుంటే మునిసిపల్ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవలసి వస్తుందని నోటీస్‌లో పేర్కొంది. 

ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపే అని, ఎన్నికల హామీలు అమలుచేయలేక ప్రజల దృష్టిని మళ్లించడానికే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఈవిదంగా తమ పార్టీపై బురద జల్లెందుకు ప్రయత్నిస్తోందని బిఆర్ఎస్ పార్టీ వాదిస్తుందని వేరే చెప్పక్కరలేదు.

అప్పుడు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం హనుమకొండ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయిస్తుందా లేక కూల్చివేస్తే బిఆర్ఎస్ పార్టీకి రాజకీయ మైలేజీ లభిస్తుందని వెనక్కు తగ్గుతుందా? ఒకవేళ ముందుకు వెళ్ళినా, వెనక్కు తగ్గినా బిఆర్ఎస్ పార్టీదే పైచేయి అవుతుంది కదా?

ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా తాడేపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూల్చివేసి, ఏపీలో ప్రతీ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూములలో నిర్మించుకున్న వైసీపి కార్యాలయాలకు నోటీసులు జారీ చేసింది.

దీంతో ఎన్నికలలో ఓడిపోయి ప్రజలకు మొహం చూపలేని పరిస్థితిలో ఉన్న వైసీపికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని వేలెత్తి చూపుతూ విమర్శించే అవకాశం లభించడంతో రెచ్చిపోయింది.

ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ కూడా ఇంచుమించు అదే పరిస్థితిలో ఉంది. కనుక హన్మకొండ కాయ్రాయాన్ని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కూల్పించేస్తే బిఆర్ఎస్ పార్టీ కూడా అదే చేస్తుంది. కనుక రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాల జోలికి వెళుతుందో లేదో చూడాలి.


Related Post