మీ ఏడుపే మా ఎదుగుదల: కేటీఆర్‌ ట్వీట్‌

July 02, 2024


img

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీలు రెండు పూర్తిభిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. కేసీఆర్‌ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో భారీగా అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ విచారణ జరిపిస్తోంది.

కేసీఆర్‌ అజ్ఞానం, కమీషన్ల కక్కుర్తి వల్లనే మేడిగడ్డ వద్ద బ్యారేజి కట్టించారని, కమీషన్ల కక్కుర్తి వలననే నాసిరకంగా నిర్మాణాలు జరిగాయని, దశాబ్ధాలపాటు ధృడంగా నిలబడాల్సిన మేడిగడ్డ బ్యారేజి కట్టిన మూడేళ్ళకే క్రుంగిపోయిందని, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల గోడలు పగుళ్ళు ఇచ్చి నీళ్ళు లీక్ అయిపోతున్నాయని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరోపిస్తోంది.

దీనిపై జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ కమీషన్‌ చేత విచారణ జరిపిస్తోంది. దాని గడువు జూన్30తో ముగియడంతో మరో రెండు నెలలు పొడిగించింది కూడా. ఏసీబీ విచారణలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక లోపాలు, అవకతవకలు జరిగిన్నట్లు గుర్తించారు.

కమీషన్‌ విచారణకు హాజరవుతున్న వివిదశాఖల ఉన్నతాధికారులు కూడా ఇదే ధృవీకరిస్తున్నారు. కమీషన్‌ మరింత లోతుగా విచారణ జరిపితే మరిన్ని అవకతవకలు, అవినీతి బయటపడుతుందని కాంగ్రెస్‌ ప్రభుత్వం భావిస్తోంది. 

అయితే కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం మేడిగడ్డ బ్యారేజి మాత్రమే కాదని తెలియని అజ్ఞానం కాంగ్రెస్‌ ప్రభుత్వానిదంటూ బిఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఓ పెద్ద ట్వీట్‌ చేశారు. అది తెలంగాణకు జీవనాడి అని, ఎక్కడో చిన్న లోపం తలెత్తితే దాని సరిచేసుకోగలమని దానిలో పేర్కొన్నారు. మీ రాజకీయ కుళ్ళు, కుతంత్రాలను, దిష్టి చూపులను తట్టుకోగలం మీ ఎదుపే మా ఎదుగుదల అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. 

కనుక కాళేశ్వరం ప్రాజెక్టు వలన తెలంగాణ రాష్ట్రానికి కలిగిన లాభం ఎంత? నష్టం ఎంత?ప్రాజెక్టులో నాసిరకం పనులు జరిగాయా లేక కేసీఆర్‌ వాదిస్తున్నట్లు ఇంత భారీ ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజిలో మూడు పియర్స్ క్రుంగటం చాలా చిన్న విషయంగానే పరిగణించి మరమత్తులు చేసుకొని వాడుకోవాలా? అనే విషయాలు కమీషన్‌ విచారణలో బయటపడతాయి. 


Related Post