తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్ళీ అసంతృప్తి రాగాలు?

June 30, 2024


img

తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీలో పలువురు నేతలు అసంతృప్తిగా ఉండేవారు. వారిలో కొందరు రేవంత్‌ రెడ్డి నాయకత్వాన్ని అంగీకరించేందుకు కూడా ఇష్టపడేవారు కారు. కానీ ఎన్నికలలో కాంగ్రెస్‌ గెలిచి రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పార్టీ నేతల ధోరణిలో మార్పు వచ్చింది.

దాదాపు అందరూ ఆయన నాయకత్వాన్ని అంగీకరించి బుద్ధిగా ప్రవర్తిస్తున్నారు. సిఎం రేవంత్‌ రెడ్డి పార్టీలో సీనియర్లందరినీ కలుపుకుపోతూ వారికి తగిన పదవులు, ప్రాధాన్యం, స్వేచ్చ ఈయడం వలననే ఈ మార్పు సాధ్యపడిందని చెప్పవచ్చు. 

అయితే నేటికీ కొందరు కాంగ్రెస్‌ నేతలు రేవంత్‌ రెడ్డి తీరు పట్ల లేదా తమకు ప్రాధాన్యం లభించకపోవడం వలన అసంతృప్తిగా ఉన్నారు. నర్సాపురం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి వారిలో ఒకరు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇస్తున్నారు కానీ కాంగ్రెస్‌ పార్టీలో చాలా కాలంగా ఉన్న తనకు సముచిత ప్రాధాన్యం లభించడం లేదని ఆయన ఆవేదనతో ఉన్నారు.

నిన్న సిఎం రేవంత్‌ రెడ్డి వరంగల్‌ పర్యటనకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి ఆయన పర్యటనకు దూరంగా ఉండిపోయారు. తద్వారా సిఎం రేవంత్‌ రెడ్డికి తన అసంతృప్తిని తెలియజేసేందుకు ప్రయత్నించిన్నట్లున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకునేందుకే రేవంత్‌ రెడ్డి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఆకర్షించి పార్టీలో చేర్చుకుంటున్నారు.

కానీ ఇప్పుడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలలో అసంతృప్తి మొదలైతే కధ మళ్ళీ మొదటికొస్తుంది. కనుక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలందరినీ కూడా సిఎం రేవంత్‌ రెడ్డి ఏదో విధంగా సంతృప్తిపరచక తప్పదేమో? 


Related Post