జగదీష్ రెడ్డి కూడా విచారణకు డుమ్మా?

June 29, 2024


img

ఛత్తీస్‌ఘడ్‌ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రాలలో జరిగిన అవకతవకలపై జస్టిస్ నరసింహా రెడ్డి కమీషన్‌ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. వాటిపై కమీషన్‌ ఎదుట వారం రోజులలోగా హాజరయ్యి  వివరణ ఇవ్వాలని కోరుతూ మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డికి నోటీసు పంపింది. తాను తప్పకుండా విచారణకు హాజరవుతానని జగదీష్ రెడ్డి చెప్పారు. కానీ ఇప్పుడు ఆయన కూడా 8 పేజీల లేఖ వ్రాసి కమీషన్‌కు పంపించారు. అంటే కేసీఆర్‌లాగే ఆయన కూడా విచారణకు హాజరు కాదలచుకోలేదని స్పష్టం అయ్యింది. 

తమ ప్రభుత్వ నిర్ణయాలను సమర్ధించుకుంటూ కేసీఆర్‌ లేఖలో వ్రాసిన విషయాలనే ఆయన కూడా వ్రాశారు. ఎక్కడ ఎటువంటి తప్పులు జరుగలేదని, అంతా నిబంధనలకు లోబడే చాలా పారదర్శంగా జరిగాయని దానిలో పేర్కొన్నారు.

ఈ అంశంపై జస్టిస్ నరసింహా రెడ్డి కమీషన్‌కు విచారణ చేపట్టే అర్హత లేదని కనుక దానిని రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్‌ హైకోర్టులో ఓ పిటిషన్‌ వేశారు. త్వరలో దాని విచారణ జరుగనుంది. ఒకవేళ కేసీఆర్‌ తరపు న్యాయవాది వాదనలతో హైకోర్టు ఏకీభవిస్తే జస్టిస్ నరసింహా రెడ్డి కమీషన్‌ రద్దు చేస్తే ఈ వ్యవహారం ఇక్కడితోనే ముగిసిపోవచ్చు ఒకవేళ వ్యతిరేకంగా తీర్పు వస్తే సుప్రీంకోర్టు వరకు సాగవచ్చు.


Related Post