అప్పుడే మోడీ చెయ్యి మెలి పెడుతున్న నితీష్ కుమార్‌

June 29, 2024


img

మోడీ ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెల రోజులు కాలేదు. అప్పుడే బిహార్‌ సిఎం నితీష్ కుమార్‌ మోడీ ప్రభుత్వంతో ఆట మొదలుపెట్టేశారు. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఇదివరకే శాసనసభలో కూడా దీని కోసం తీర్మానం చేశారు. ఇప్పుడు జేడీయూ పార్టీలో కూడా ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజ్ ఇవ్వాలని తీర్మానం చేయించారు. 

ఏపీలో రాజకీయ పార్టీలలాగ ప్రత్యేక హోదా అంశంపై రాజకీయాలు చేస్తూ కాలక్షేపం చేసే రకం కాదు నితీష్ కుమార్‌. ఏదైనా తలుచుకుంటే అది పూర్తి చేసేవరకు విడిచిపెట్టే అలవాటే లేదు ఆయనకు. కనుక బిహార్‌కు ప్రత్యేక హోదా కూడా సాధించే తీరుతారని భావించవచ్చు. 

అయితే ఆయన చాలా కాలంగా తగిన సమయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం మనుగడకు జేడీయూ 12 మంది ఎంపీల మద్దతు చాలా కీలకం కావడంతో, మోడీ చెయ్యి మెలిపెట్టి ప్రత్యేక హోదా సాధించుకునేందుకు సిద్దం అవుతున్నారనుకోవచ్చు. 

కేంద్ర ప్రభుత్వ మనుగడకు కనీసం 272 ఎంపీలు అవసరం. ఎన్డీయేలో జేడీయు 12 మంది, టిడిపి, జనసేనల 18 మంది ఎంపీలు కలిపితే మొత్తం 293 మంది మాత్రమే ఉన్నారు. కనుక నితీష్ కుమార్‌ మద్దతు ఉపసంహరించుకుంటే అప్పుడు ఎన్డీయేలో 281 మంది మిగులుతారు. అంటే 9 మంది ఎంపీల మెజార్టీతో మోడీ ప్రభుత్వం నడుపవలసి ఉంటుందన్న మాట! 

అప్పుడు మోడీ ప్రభుత్వం టిడిపి, జనసేనలపై మరింతగా ఆధారపడవలసి వస్తుంది. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇమ్మనమని అడగగలిగే స్థితిలో ఉంటారన్న మాట! నితీష్ కుమార్‌ డిమాండ్‌కు తలొగ్గి బిహార్‌కు ప్రత్యేక హోదా ఇస్తే ఆ తర్వాత ఏపీ, తెలంగాణ, ఝార్ఖండ్, ఛత్తీస్‌ఘడ్‌ ఇంకా చాలా రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోసం క్యూ కడతాయి. కనుక నితీష్ కుమార్‌ పెట్టిన ఈ పరీక్షలో మోడీ ఎలా నెగ్గుకువస్తారో చూడాలి. 


Related Post