హమ్మయ్య... జీవన్ రెడ్డి అలక వీడారు

June 27, 2024


img

జగిత్యాల బిఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడాన్ని నిరసిస్తూ పార్టీకీ, ఎమ్మెల్సీ పదవికి రాజీనామాకు చేసేందుకు సిద్దమైన జీవన్ రెడ్డి, ఢిల్లీలో కాంగ్రెస్‌ అధిష్టానం బుజ్జగించిన తర్వాత అలక వీడారు.

పార్టీలో తన వంటి సీనియర్లను, కార్యకర్తల మనోభావాలను గౌరవించాలని కోరుకుంటున్నానని చెప్పారు.  ఇకపై అందరితో చర్చించిన తర్వాతే అటువంటి నిర్ణయాలు తీసుకుంటామని కాంగ్రెస్‌ అధిష్టానం హామీ ఇచ్చిందన్నారు. కనుక రాజీనామా ఆలోచన విరమించుకుని ఎప్పటిలాగే కాంగ్రెస్ పార్టీలో కొనసాగబోతున్నట్లు జీవన్ రెడ్డి తెలిపారు. 

త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగబోతోంది కనుక కాంగ్రెస్‌ అధిష్టానం జీవన్ రెడ్డికి ఏమైనా హామీ ఇచ్చిందా లేదా? అనే విషయం త్వరలోనే తెలియవచ్చు. ఏది ఏమైనప్పటికీ, కాంగ్రెస్‌ బలం పెంచుకుని ప్రభుత్వానికి సుస్థిరత కల్పించేందుకు బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను దిగుమతి చేసుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి సమస్యలు కూడా ఉత్పన్నం అవుతాయని స్పష్టం అయ్యింది. కానీ ఇదే సమయంలో కాంగ్రెస్‌ అధిష్టానం చేరికలకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేసిన్నట్లు వార్తలు వస్తుండటం విశేషం. 

ప్రస్తుతం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని కాంగ్రెస్ పార్టీలోకి రప్పించేందుకు ముమ్ముర ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదేవిదంగా వరంగల్ కాంగ్రెస్ నేతలు యన చేరికను అడ్డుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే సంజయ్ కుమార్‌-జీవన్ రెడ్డి వంటి మరో ఎపిసోడ్ కాంగ్రెస్ పార్టీలో జరిగే అవకాశం ఉందనుకోవచ్చు. జీవన్ రెడ్డి హడావుడి చూసినందున ఎర్రబెల్లి విషయంలో సిఎం రేవంత్‌ రెడ్డి అన్ని జాగ్రత్తలు తీసుకుంటారనే ఆశిద్దాం.


Related Post