కూతురునే కాపాడుకోలేని కేసీఆర్‌ ఎమ్మెల్యేలను కాపాడగలరా?

June 27, 2024


img

బిఆర్ఎస్ పార్టీ నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్‌ కాంగ్రెస్‌లో చేరిపోవడంతో, కేసీఆర్‌ అప్రమత్తమయ్యారు. బుధవారం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో సమావేశమయ్యి పార్టీ పరిస్థితిపై చర్చించారు. 

“మీలో ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా నాకు తెలియజేయండి. మీ అందరికీ నేను అండగా ఉంటాను. కనుక కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంతగా ఒత్తిడి చేసినా ఎవరూ పార్టీని వీడిపోవద్దు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి న్యాయపోరాటం చేద్దాం. త్వరలోనే రాజకీయ పరిస్థితులు మారబోతున్నాయి. మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాము,” అని కేసీఆర్‌ చెప్పారు. 

కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో ఈవిదంగా ఉండి ఉంటే బహుశః నేడు ఈ దుస్థితి ఎదురయ్యేదే కాదేమో? కానీ వారు తమ సమస్యలు, నియోజకవర్గాలలో సమస్యలు చెప్పుకుందామంటే అప్పుడు ఎవరినీ ప్రగతిభవన్‌లోకి రానీయలేదు. 

ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిస్తూ వారి చేత తన భజన చేయించుకునేవారు. తన పాలన అద్భుతంగా ఉందని ఎన్నికలలో మనకు తిరుగులేదని చెపుతూ వారిని మభ్యపెట్టేవారే తప్ప తన గురించి, తన పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. చేసి ఉంటే నేడు ఈ దుస్థితి ఎదురయ్యేదే కాదేమో?  

ఇప్పుడు ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత వారితో సమావేశమయ్యి ‘మీకు ఏ చిన్న కష్టం వచ్చినా నేనున్నాను’ అని భరోసా ఇస్తున్నారు. దేనికంటే వారు కూడా చేజారిపోతారనే భయంతోనే అని అర్దమవుతూనే ఉంది. 

అయినా ‘లిక్కర్ స్కామ్‌ కేసు ఉత్తదే మోడీ, ఈడీ ఎవరూ కూడా ఏమీ చేయలేరు దమ్ముంటే టచ్‌ చేయండి’ అంటూ ప్రగల్భాలు పలికిన కేసీఆర్‌, సీబీఐ అధికారులు హైదరాబాద్‌ వచ్చి తన కళ్ళ ముందే కూతురు కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకుపోతుంటే ఆపగలిగారా?అరెస్ట్ అయ్యి మూడున్నర నెలలు కావస్తున్నప్పటికీ ఆమెను విడిపించుకోగలిగారా?

కూతురినే కాపాడుకోలేకపోయిన కేసీఆర్‌ ఎమ్మెల్యేలను కాపాడగలరా? పటాన్‌చెరు బిఆర్ఎస్‌ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి రూ.300 కోట్లు అక్రమాస్తులు కలిగి ఉన్నారని ఈడీ చెపితే ఆయన వెంటనే ఢిల్లీకి పరిగెత్తారు తప్ప కాపాడమని కేసీఆర్‌ వద్దకు ఎందుకు రాలేదు?వస్తే కాపాడేవారా? అంటే కాదనే అర్దమవుతోంది.

కనుక బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు కేసీఆర్‌ మాటలను నమ్మి కాంగ్రెస్‌, బీజేపీ ఒత్తిళ్ళు భరిస్తూ ఆయన కోసం బిఆర్ఎస్‌ పార్టీలోనే ఉంటారనుకోలేము.

కేసీఆర్‌ ఇంతగా నచ్చజెప్పిన తర్వాత కూడా ఎమ్మెల్యేలు పార్టీ వీడితే, ఆయన మాటలను వారు నమ్మడం లేదని స్పష్టం అవుతుంది. దాని వలన కేసీఆర్‌ పరువే పోతుంది. కనుక పార్టీని కాపాడుకోవడానికి మరేమైనా మార్గాలున్నాయేమో ఆలోచిస్తే మంచిదేమో?


Related Post