మాజీ స్పీకర్‌పై ప్రస్తుత స్పీకర్‌కు బిఆర్ఎస్‌ ఫిర్యాదు!

June 26, 2024


img

బిఆర్ఎస్‌ పార్టీ గతంలో చేసిన తప్పులకు ఇప్పుడు అనూహ్యమైన సమస్య ఎదుర్కొంటోంది. ఆనాడు బిఆర్ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు శాసనసభ స్పీకర్‌గా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉండేవారు.

అప్పుడు ఇతర పార్టీల ఎమ్మెల్యేలని బిఆర్ఎస్‌లో చేర్చుకున్నప్పుడు ఆయా పార్టీల నేతలు ఆయనను కలిసి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేస్తుండేవారు. కానీ అప్పుడు సిఎం కేసీఆర్‌ అనుమతి లేనిదే స్పీకర్‌ కూడా ఏమీ చేయలేక ప్రతిపక్షాల వినతి పత్రాలను చెత్తబుట్టలో పడేస్తుండేవారు. 

ఇప్పుడు ఆయనే కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడంతో బిఆర్ఎస్‌ నేతలు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ని కలిసి ఆయనపై అనర్హత వేటు వేయాలని అడగాలని ప్రయత్నించారు. కానీ ఆయన అందుబాటులో లేకపోవడంతో మాజీ మంత్రి, బిఆర్ఎస్‌ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పీకర్‌కు ఈ మెయిల్ మరియు స్పీడ్ పోస్ట్ ద్వారా వినతి పత్రాలు పంపించి, కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్‌లపై అనర్హత వేటు వేయాలని కోరారు. 

కానీ సిఎం రేవంత్‌ రెడ్డి స్వయంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్ళి పార్టీలోకి ఆహ్వానించి తెచ్చుకున్నారు. అలాగే సంజయ్ కుమార్‌కి స్వయంగా కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. అటువంటప్పుడు వారిపై స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌ అనర్హత వేటు వేస్తారా? అంటే కాదనే అర్దమవుతోంది.

మరి ఇంత చిన్న విషయం బిఆర్ఎస్‌ నేతలకు తెలీదా? అంటే తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహించి పార్టీలో చేర్చుకుంటోందని, అయినా స్పీకర్‌ పట్టించుకోకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేస్తున్నారని గట్టిగా వాదించేందుకు ఈ ప్రయత్నం అవసరం కనుక ప్రయత్నిస్తున్నట్లు భావించవచ్చు.


Related Post