జీవన్ రెడ్డికి పిలుపు.. బుజ్జగింపులకా... అక్షింతలకా?

June 26, 2024


img

కాంగ్రెస్‌ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. తనకు మాట మాత్రంగానైనా తెలియజేయకుండా జగిత్యాల బిఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ని కాంగ్రెస్ పార్టీలో సిఎం రేవంత్‌ రెడ్డి చేర్చుకోవడాన్ని నిరసిస్తూ ఆయన పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్దపడ్డారు. మంత్రులు శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క నచ్చజెప్పిన తర్వాత ఆయన మెత్తబడ్డారు కానీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని పట్టుబడుతున్నారు. 

సిఎం రేవంత్‌ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలోనే మకాం వేసి కాంగ్రెస్‌ అధిష్టానంతో మంత్రి వర్గ విస్తరణ  గురించి చర్చిస్తున్నారు. మంత్రి పదవి కోసమే బహుశః జీవన్ రెడ్డి హటాత్తుగా ఈ డ్రామా మొదలుపెట్టిన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. జీవన్ రెడ్డి సిఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయాన్నే తప్పు పడుతూ రాజీనామాకు సిద్దమయ్యారు. కనుక ఇప్పుడు కాంగ్రెస్‌ అధిష్టానం ఈ పంచాయితీలో తీర్పు చెప్పాల్సి ఉంటుంది.  

ఢిల్లీకి వస్తున్న జీవన్ రెడ్డికి కాంగ్రెస్‌ అధిష్టానం మంత్రి పదవే ఇస్తుందో లేదా రాజీనామా పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నందుకు అక్షింతలే వేసి పంపిస్తుందో రేపోమాపో తేలిపోతుంది.


Related Post