ఫుడ్ ఫెస్టివల్స్ తో తెలంగాణ ఆవిర్భావ వార్షికోత్సవాలకు వైభవం

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రెండవ సంవత్సరం కూడా ఘనంగా జరపాలని అధికారులు నిశ్చయించారు. ముఖ్యంగా ఈ సారి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు వెల్లివిరిసేలా, రాష్ట్రం మొత్తం మీద పేరున్న పెద్ద స్టార్ హోటల్స్ చే, రాష్ట్ర వంటకాలు తయారు చేయించి, జూన్ 2న, నెక్లెస్ రోడ్ పై ఫుడ్ ఫెస్టివల్  నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా శరవేగంగా సాగుతున్నట్లు సమాచారం. 

ఐటీసి కాకతీయ హోటల్ వారు జూన్ 3 నుండి 12వ తేది వరకు నిర్వహించే ఫుడ్ ఫెస్టివల్ లో ప్రముఖ తెలంగాణ వంటలు-  పచ్చి పులుసు, బోటి కార్జం ఫ్రై, ఊరి కోడి పలావు, దేశం కోడి, పెరుగు పచ్చడి లాంటి ఎన్నో రకాల రుచులు చూపెట్టబోతోంది.

ఇక ప్రముఖ ట్రైడెంట్ హోటల్ వారి మెనూ లిస్టులో ఉన్న ఐటమ్స్- తెలంగాణ కోడి కూర, కోడి గుడ్డు పులుసు, గోంగూర మాంసం (మసాలా గొర్రె కూర), చేపల పులుసు (చింతపండు సాస్ లో చేపల కూర), పచ్చి మామిడి కూర. ఇతర హోటల్స్ మెనూలో కూడా ఇవే వంటకాలు విభిన్నమైన రుచులలో ఫుడ్ ఫెస్టివల్ లో భాగంగా, 10 రోజుల వరకు అందుబాటులో ఉంటాయి. కేవలం వంటలతోనే సరిపెట్టకుండా, జూన్ 2న వరంగల్, ఆదిలాబాద్ నుండి సాంస్కృతిక నృత్యకారులు హైదరాబాద్ లో తమ ప్రదర్శనలు ఇస్తారు.